Breaking News

ఈ నెల 23లోగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి

S.I.R.లో నమోదు చేయకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి.. ఒకే చోట కూర్చుని ప్రక్రియ నిర్వహించొద్దు: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, జూలై 8:E6 న్యూస్ (తాటికొండ గంగాధర్)
బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హ ఓటరు ఈ నెల 23వ తేదీలోగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (S.I.R.) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో తహసీల్దార్ సమక్షంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను స్వయంగా బూత్ లెవల్ అధికారులకు (BLO) అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, అధికారుల సంతకంతో కూడిన మరో ఫారాన్ని రసీదుగా తన వద్ద భద్రపరుచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన S.I.R. కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత BLOలకు అందజేయాలని సూచించారు. ఫారాన్ని నింపడం మాత్రమే కాకుండా, అది అధికారులకు చేరి ఆన్‌లైన్‌లో నమోదు కావడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. నమోదు ప్రక్రియ పూర్తికాకపోతే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.

బీఎల్‌ఓలకు ఎమ్మెల్యే కీలక సూచనలు చేస్తూ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, దేవాలయాలు లేదా ఇతర భవనాల్లో ఒకే చోట కూర్చుని వివరాలు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి వివరాలు సేకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరమే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఓటరు నమోదు ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కూడా చురుకుగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. బీఎల్‌ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లి, ఏ ఒక్క అర్హ ఓటరు నమోదు కాకుండా మిగలకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వేల్పూర్ తహసీల్దార్ అనిరుద్, బీఎల్‌ఓలు, సర్పంచ్ అశోక్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *