ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు
పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు
ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన ఇసుక వాహనం బుకింగ్’ యాప్ ద్వారా మాత్రమే ఇసుక తరలింపునకు అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో, మెండోరా ఆర్.ఐ సదానంద్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో అనుమతులు పొందించి, ఇసుకను ఇతర ప్రాంతాలకు దారి మళ్లించినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది.
ఈ వ్యవహారంపై అధికారులతో లబ్ధిదారులను విచారించగా, తమకు కేటాయించిన ఇసుక అందలేదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, సదానంద్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)ను ఆదేశించారు. ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం ఉపేక్షించదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

