శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో…
భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్‌పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలావత్ సంజీవ్, దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములను ప్రశ్నించగా చిరుతపులిని చంపినట్లు అంగీకరించారు. వారి సూచన మేరకు కారేపల్లి దక్షిణ బీట్‌లోని 79వ కంపార్ట్‌మెంట్‌లో భూమిలో పాతిపెట్టిన చిరుతపులి కళేబరాన్ని వెలికితీశారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. సుమారు నెల రోజుల క్రితం మాలావత్ సంజీవ్ మేకలను మేపుతుండగా ఒక ఆడమేకను చిరుతపులి చంపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సిరిసిల్ల రాములు చిరుతపులిని చంపి దాని శరీర భాగాలను విక్రయిస్తే భారీగా డబ్బు వస్తుందని ప్రలోభపెట్టాడు. దీంతో సంజీవ్ తన గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి మేక కళేబరంలో విషాన్ని సిరంజి ద్వారా ఎక్కించారు. మరుసటి రోజు చిరుతపులి మృతి చెందినట్లు గుర్తించి, దాని కళేబరాన్ని భూమిలో దాచిపెట్టి కొనుగోలుదారుడు దొరికిన తర్వాత విక్రయించాలని యోచించినట్లు అధికారులు తెలిపారు.దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా ఎటువంటి లైసెన్స్ లేని ఒక నాటు తుపాకీ లభించింది. దానిని తదుపరి విచారణ కోసం భీంగల్ పోలీసులకు అప్పగించారు.
వన్యప్రాణి అయిన చిరుతపులిని ఉద్దేశపూర్వకంగా హతమార్చినందుకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–2022, తెలంగాణ అటవీ చట్టం, జీవవైవిధ్య చట్టాల కింద కేసులు నమోదు చేసి ఆర్మూర్ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

