Breaking News

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల వరకు పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

బీజేపీ ఆధ్వర్యంలో ‘ఇందూరు రణభేరి’ నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

ఇందూరు, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలో కమిషన్లకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కీలకమని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తోందని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.12 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొన్నారు.

విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్‌లో కూడా కమిషన్లు కోరుతోందని ఆరోపిస్తూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.గత ఏడాది ప్రైవేట్ కళాశాలల బంద్ నేపథ్యంలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు.ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా విడుదలయ్యే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని, నిజామాబాద్ నుంచి ప్రారంభమైన ‘ఇందూరు రణభేరి’ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *