Breaking News

డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 4న ‘చలో బస్ భవన్’

సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది విశ్రాంత ఉద్యోగులతో ముట్టడి

పీఎఫ్, వేతన సవరణ, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్

నిజామాబాద్, జూలై 30: (E6 tv NEWS ప్రతినిధి)

ఆర్టీసీ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించనున్నట్లు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం తెలిపారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2013 ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ బకాయిలు, 2017, 2021 వేతన సవరణ (ఆర్‌పీఎస్) బకాయిలు, గ్రాట్యుటీ డిఫరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఏరియర్స్ వంటి చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించినప్పటికీ, పదవీ విరమణ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెన్షన్ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా దాదాపు 300 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని, తాము జీవించి ఉన్నప్పుడే ఆ మొత్తాలను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 3లోపు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది విశ్రాంత ఉద్యోగులతో కలిసి ఆగస్టు 4న బస్ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సుదీర్ఘకాలం సంస్థకు సేవలందించిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వేతన సవరణ అమలైనప్పటికీ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు పి. రామచందర్, జిల్లా కార్యదర్శి ఎస్. పోశెట్టి, కోశాధికారి సుదర్శన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఎల్. నారాయణ, డి.ఎస్.బి. రాజు, జీవి చారి, ఆర్. నర్సింలు, జిల్లాలోని అన్ని డిపోల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రధాన డిమాండ్లు:

2013 పీఎఫ్ కాంట్రిబ్యూషన్ బకాయిల చెల్లింపు

2017, 2021 వేతన సవరణ బకాయిల విడుదల

గ్రాట్యుటీ డిఫరెన్స్ చెల్లింపు

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఏరియర్స్ విడుదల

విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *