హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు అభినందనీయం
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి
నిజామాబాద్ జూలై 30: (E6 tv NEWS శివ ఠాకూర్).
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా (HYDRAA) చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ప్రకటించారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు వంటి ప్రజా ఆస్తులను పరిరక్షించేందుకు హైడ్రా చేపడుతున్న చర్యలు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. గతంలో జరిగిన భూ ఆక్రమణలను వెలికితీసి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ చట్టపరిధిలోనే విధులు నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అభిప్రాయపడ్డారు.గత పాలనలో జరిగిన భూ ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలు, నాలాల మూసివేత వంటి కారణాల వల్లే నేడు హైదరాబాద్‌లో స్వల్ప వర్షాలకే వరద పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. అలాంటి పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
హైడ్రా ద్వారా ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణల నుంచి విముక్తి పొందాయని, వాటి విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, వరదల నివారణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు, కమిషనర్ రంగనాథ్‌కు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్న ధర్మపురి సంజయ్, ప్రజల ఆస్తులను కాపాడే సంస్థగా హైడ్రా పనిచేస్తోందని అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, ప్రజా ఆస్తుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి కోసం హైడ్రా చర్యలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

