బాధితుల వాంగ్మూలాలు తీసుకోకుండానే విచారణ పూర్తి చేస్తారా?
పై హోదాలో ఉన్న అధికారిపై కింది స్థాయి అధికారి విచారణ ఎలా?
గత నివేదికల్లో వైరుధ్యాలున్నాయంటున్న ఫిర్యాదుదారులు
కొత్తగూడెం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి).
మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖలో చేపట్టిన తాజా విచారణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చిన ఎస్‌ఈ స్థాయి అధికారి కొత్తగూడెం డీఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. అయితే గతంలో ఫిర్యాదులు చేసిన, సంబంధిత వ్యవహారంలో బాధితులుగా ఉన్న ఉద్యోగులందరి వాంగ్మూలాలను తీసుకున్నారా? లేదా కొందరి వాంగ్మూలాలతోనే విచారణను ముగించనున్నారా? అనే సందేహాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గత నివేదికలపై అసంతృప్తితోనే మళ్లీ విచారణ?
ఈ వ్యవహారంపై గతంలో జిల్లా అధికారి, విజిలెన్స్ అధికారి స్థాయిలో విచారణలు జరిగి నివేదికలు సమర్పించినప్పటికీ, ఆయా నివేదికల్లో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ నిబంధనలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండానే నివేదికలు రూపొందించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా డీఈపై వచ్చిన ఫిర్యాదులపై గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించలేదు? బాధిత ఉద్యోగుల వాదనలను ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
అసలు తాజా విచారణ పరిధి ఎంత?
గతంలో జిల్లా ఎస్‌ఈగా పనిచేసిన అధికారి ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో, అదే వ్యవహారంపై ప్రస్తుతం ఎస్‌ఈ స్థాయి అధికారి విచారణ చేపట్టడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకంటే ఉన్నత హోదాలో ఉన్న అధికారికి సంబంధించిన అంశాలను కింది స్థాయి అధికారి విచారించే సందర్భంలో అనుసరించాల్సిన పరిపాలనా విధానం ఏమిటి? విచారణకు నిర్దేశించిన పరిధి, బాధ్యతలు ఏమిటి? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
బాధితులందరి వాంగ్మూలాలు తీసుకోవాలి
ఫిర్యాదుల వెనుక ఉన్న ఉద్యోగుల వాదనలు, వారి వద్ద ఉన్న ఆధారాలు, గతంలో జరిగిన పరిణామాలను పూర్తిస్థాయిలో నమోదు చేయకుండా సమగ్ర విచారణ సాధ్యమవుతుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. బాధితులుగా పేర్కొంటున్న ఉద్యోగులందరినీ విచారణకు పిలిచి, వారి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు వారు సమర్పించే ఆధారాలను కూడా పరిశీలించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
నిష్పక్షపాత విచారణకు ఉద్యోగుల డిమాండ్
ఇప్పటికే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన కొందరు ఉద్యోగులు తమ వాంగ్మూలాలను నేరుగా కమిషన్ చైర్‌పర్సన్‌కు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మొత్తంగా తాజా విచారణ వాస్తవాలను వెలికితీసే దిశగా సాగుతుందా? లేక గత నివేదికల మాదిరిగానే మరో నివేదికతో వ్యవహారం ముగుస్తుందా? అన్నది ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి విచారణను సమగ్రంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి, బాధితుల వాంగ్మూలాలు మరియు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం వాస్తవాలను మానవ హక్కుల కమిషన్ ముందుంచాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.

