వసతులు మేము కల్పిస్తాం.. మెరుగైన వైద్యం మీరందించండి : ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జీజీహెచ్ అభివృద్ధి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన జరిగిన జీజీహెచ్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆసుపత్రి సేవలు, మౌలిక వసతులు, వైద్య విభాగాల పనితీరుపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైద్యులు సేవాభావంతో పనిచేసి ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెంచాలని అన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమ సేవలు అందిస్తోందని, రాష్ట్రంలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలను మరింత బలోపేతం చేయాలని, వెంటిలేటర్లు, ఆధునిక వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రోగులతో వైద్యులు, సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, జీరో మోర్టాలిటీ లక్ష్యంగా వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు.
సమావేశంలో వివిధ విభాగాల అధిపతులు తమ శాఖల్లో అందిస్తున్న వైద్య సేవలు, అవసరమైన మౌలిక వసతులు, పరికరాలపై వివరాలను సమర్పించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సమావేశంలో స్పష్టం చేస్తూ, పారిశుద్ధ్యం, మాదకద్రవ్యాల నిర్మూలన, డీ-అడిక్షన్ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, IIHFW చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

