తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన..
హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా లో భారీ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో దాదాపు 105 మిల్లీమీటర్ల వర్షం రికార్డయింది.నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల ప్రభావం, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో తదుపరి 12 నుంచి 18 గంటల పాటు నిరంతర మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, రైతులు మరియు ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


