Breaking News

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు: కల్వకుంట్ల కవిత

ప్రభుత్వ ఈవీ ఆటోల నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం

ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న వారికే అవకాశం కల్పించాలని డిమాండ్

ఆటో డ్రైవర్లకు అండగా ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక

హైదరాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆమె, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతామనే భయాందోళనను వ్యక్తం చేయగా, వారి తరపున తెలంగాణ రక్షణ సేన అండగా నిలిచి ఉద్యమిస్తామని కవిత హామీ ఇచ్చారు.

కేవలం బస్సు ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆటో బుక్ చేసుకుంటే సరిపోతుందని, కానీ ప్రభుత్వం ఆ సేవలను కూడా తానే నిర్వహించే ప్రయత్నం చేయడం సమంజసం కాదని ఆమె అన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోయి, ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ఈవీ ఆటోల పేరుతో ప్రభుత్వమే భారీ సంఖ్యలో వాహనాలను ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన “వన్ స్టేట్ – వన్ పర్మిట్” హామీతో పాటు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు.అదనంగా ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో చలాన్ల భారం కూడా ఆటో డ్రైవర్లపై పడుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకే లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవల్లో అవకాశం కల్పించాలని, ఈ అంశంపై ప్రభుత్వం ఆటో యూనియన్లతో చర్చించి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే ఆటో డ్రైవర్లతో కలిసి ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపడతామని హెచ్చరించిన కవిత, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం ప్రవేశపెట్టే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈవీ ఆటోలను రోడ్లపైకి రానివ్వబోమని, రాష్ట్రంలోని అన్ని ఆటో డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే చెత్త సేకరణలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది ఈవీ ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *