భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఉచిత వాహన సేవ ప్రకటింపు
ముథోల్, జూలై 30: E6 tv NEWS(ఆకుల తిరుపతి గౌడ్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ నిర్ణయించారు. ప్రజా సేవే తన లక్ష్యమని పేర్కొంటూ, మండల కేంద్రం ముథోల్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సమయంలో ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం తనకు లభించిందని, అదే సేవా స్ఫూర్తితో ప్రస్తుతం వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వారు, రోడ్డు ప్రమాద బాధితులు, గుండెపోటు, శ్వాస సంబంధిత సమస్యలు లేదా ఇతర అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందిస్తానని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం వచ్చినా పగలు–రాత్రి అనే తేడా లేకుండా, అర్థరాత్రి అయినా తన సొంత వాహనంలో భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి లేదా అవసరమైన వైద్య కేంద్రానికి ఉచితంగా తరలిస్తానని స్పష్టం చేశారు.భారీ వర్షాల కారణంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మానవత్వమే గొప్ప సేవ అనే భావనతో అత్యవసర సమయంలో ప్రజలకు అండగా నిలిచి తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
అవసరమైన సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే తన బాధ్యతగా భావిస్తున్నానని, గతంలో ఎలా ప్రజలకు సేవలందించానో ఇప్పటికీ అదే సేవా నిబద్ధతతో అందుబాటులో ఉంటానని గడ్డం సుభాష్ తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలు సంకోచించకుండా పగలైనా, రాత్రైనా తనను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


