సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పాల్వంచ, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)
పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించే వేదికలుగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
వినాయక చవితి సందర్భంగా పాల్వంచ పట్టణ పరిధిలో వివిధ గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన మండపాలను సోమవారం ఎమ్మెల్యే సందర్శించి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ పండుగలు, ఉత్సవాలను ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. తద్వారా మానవ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు.ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. కులమతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలు జరుపుకోవడం ప్రజాస్వామ్య భారతదేశంలో మంచి పరిణామమన్నారు. భక్తి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రజలు రాగద్వేషాలకు దూరంగా ఉంటారని, తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు.
ఉత్సవ కమిటీలు భారీగా ఖర్చు చేసి వేడుకలు నిర్వహించడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా వివిధ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమాలయ్య, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, గొర్లె అన్నపూర్ణ, నామ కీర్తి, నూనావత్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

