తండ్రి, తనయుల సేవలను గుర్తుచేసుకుంటున్న రైతులు
కోటగిరి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి సహకార సంఘం (సొసైటీ) నూతన చైర్మన్ పదవికి వెనిగళ్ల సుధీర్ పేరు రైతుల మధ్య చర్చనీయాంశంగా మారింది. గతంలో సొసైటీ అభివృద్ధికి వెనిగళ్ల కుటుంబం అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్న రైతులు.. సుధీర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
వెనిగళ్ల సుధీర్ తండ్రి స్వర్గీయ వెనిగళ్ల భాస్కర్ రావు 1980 నుంచి 2000 సంవత్సరం వరకు కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన హయాంలో సొసైటీ అద్దె భవనంలో కొనసాగుతుండగా, సొసైటీ నిధులతో స్థలం కొనుగోలు చేసి ప్రస్తుతం ఉన్న సొసైటీ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొంటున్నారు. అలాగే సొసైటీకి సంబంధించిన 4 టన్నుల సామర్థ్యం గల రైస్ మిల్ ఉన్న ప్రాంగణంలో సుమారు ఎకరం 20 గుంటల స్థలాన్ని సొసైటీ నిధులతో కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇక వెనిగళ్ల సుధీర్ 2013 నుంచి 2020 వరకు కొత్తపల్లి సొసైటీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన హయాంలో కొత్తపల్లి గ్రామంలో సొసైటీ నిధులతో 500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 4 టన్నుల రైస్ మిల్ పక్కన 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో గోదాం నిర్మాణం కూడా జరిగినట్లు తెలిపారు. లింగాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద 3 గుంటల భూమిని సొసైటీ నిధులతో కొనుగోలు చేసి సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు.
రాంపూర్‌లో శిథిలావస్థకు చేరిన గోదాంను సుమారు రూ.2 లక్షల సొసైటీ నిధులతో మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో రైతులకు గోల్డ్ లోన్ సౌకర్యం, సకాలంలో రైతు రుణాలు, విత్తనాల సరఫరా తదితర సేవలను అందించడంలో తండ్రి, తనయులు కీలకంగా వ్యవహరించారని రైతులు గుర్తుచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ల సుధీర్‌కు అవకాశం కల్పిస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందడంతో పాటు సొసైటీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు సహకారంతో సుధీర్‌కు మద్దతు లభించాలని రైతులు కోరుకుంటున్నట్లు తెలిపారు.

