తెలంగాణలో 22ఏ (Section 22A) నిషేధిత జాబితా భూముల సమస్య తీవ్రరూపం దాల్చిందని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య ప్రజలు తమ భూముల రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ వ్యాఖ్యలు & రఘునందన్ రావు ప్రధాన విమర్శలు
- మంత్రి పొంగులేటిపై విమర్శలు: అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూములపై ఒక స్పష్టమైన చారిత్రాత్మక నిర్ణయం వస్తుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందని రఘునందన్ రావు మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనీస సన్నాహాలు లేకుండా సభకు వచ్చి అరకొర సమాచారంతో సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.
- 47,440 ఎకరాల లెక్కలపై ప్రశ్న: గత బీఆర్ఎస్ పాలనలో కోటి ఎకరాలకు పైగా భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో చేర్చిన అధికారులపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి చెబుతున్నట్లుగా ఇప్పటివరకు తొలగించామని అంటున్న 47,440 ఎకరాల వివరాలు ఏ గ్రామంలో ఎక్కడ ఉన్నాయో బహిర్గతం చేయాలని, మిగిలిన భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- హైకోర్టు జడ్జితో కమిటీ డిమాండ్: తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి ‘ధరణి’, ‘భూభారతి’ లొసుగుల వల్ల నష్టపోయిన నిరుపేదలకు తక్షణమే న్యాయం చేయాలని ఎంపీ కోరారు.
- కాంగ్రెస్ తీరుపై ధ్వజం: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ రేవంత్ సర్కార్ బురదజల్లే రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ మొదటి కేబినెట్ సమావేశంలోనే ఈ భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

