భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి – ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
యంగ్ ఇండియా పాఠశాల పనులను వేగవంతం చేయాలి
నిర్లక్ష్యంపై ఆర్‌ఐ, ఎంపీడీవోకు చర్యలకు ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)
ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. మల్కానపల్లి గ్రామంలో భూ రీ సర్వే పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పరిశీలించారు. సుమారు రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా నడిచి సర్వే పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు.గ్రామ సరిహద్దులు, భూముల విస్తీర్ణం, ఎంజాయర్ల వివరాలు, పాత రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి కొలతలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ పూర్తయినా రీ సర్వే ప్రక్రియ పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. పాత రికార్డులు, మ్యాప్‌లు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేసి భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు.
సర్వే పరిధిలో సుమారు 120 మంది ఎంజాయర్లు ఉన్నట్లు అధికారులు తెలపగా, వారి వివరాలపై సంబంధిత ఆర్‌ఐ సరైన సమాచారం ఇవ్వలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆర్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు సంబంధించిన పాత సర్వే రికార్డులు, సరిహద్దుల వివరాలను అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రీ సర్వేను వేగవంతం చేయాలని సూచించారు.
దుమ్ముగూడెం మండలంలోని 8 గ్రామాల్లో భూ రీ సర్వే జరుగుతుండగా, ఇప్పటివరకు 5 గ్రామాల సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని అధికారులు వివరించారు. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి
మల్కానపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్.. లబ్ధిదారుల వారీగా నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలపై ఎంపీడీవో వివేక్ చంద్ర సరైన సమాచారం అందించలేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై ఎంపీడీవోకు చార్జ్‌మెమో జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనం అందేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం
చిన్నబండిరేవు గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు తదితర సౌకర్యాలు అందేలా క్యాంపస్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేస్తూనే నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పరిధిలోని పనులపై పూర్తి అవగాహన కలిగి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో వివేక్ చంద్ర, ఆర్‌ఐ, సర్వే అధికారులు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

