Breaking News

మూడు దశాబ్దాల మావోయిస్టు ప్రస్థానానికి ముగింపు

సీనియర్ డీసీఎం నక్కా సుశీల రాణి పోలీసుల ఎదుట లొంగుబాటు
రూ.5 లక్షల రివార్డు.. రూ.25 వేల తక్షణ ఆర్థిక సాయం

నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)


మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సీనియర్ డీసీఎం నక్కా సుశీల రాణి అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట లొంగిపోయారు. 1992లో ప్రారంభమైన ఆమె మావోయిస్టు ప్రస్థానానికి నేడు ముగింపు పలికారు. ఆమె లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ అని సీపీ సాయి చైతన్య తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్ నగర్‌కు చెందిన నక్కా సుశీల హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులై 1992 ఫిబ్రవరిలో అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత హైదరాబాద్ సిటీ కమిటీ సాంకేతిక విభాగంలో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. అనంతరం వివిధ దళాలు, కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.1996లో ఏసీఎంగా, 2002లో డీసీఎంగా పదోన్నతి పొందిన సుశీల రాణి.. ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డీవీసీలో డివిజన్ కమిటీ సభ్యురాలిగా, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేసినట్లు సీపీ సాయి చైతన్య వెల్లడించారు.

రూ.5 లక్షల రివార్డు.. రూ.25 వేల సాయం

ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానంలో భాగంగా సుశీల రాణికి ఉన్న రూ.5 లక్షల రివార్డు మొత్తాన్ని చెక్కు రూపంలో అందించనున్నట్లు సీపీ తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.25 వేలు అందించనున్నట్లు వెల్లడించారు.పునరావాస విధానం కింద లభించే ఇతర ప్రయోజనాలతో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను కూడా కల్పించనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.

మూడు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సీనియర్ డీసీఎం లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బగా సీపీ అభివర్ణించారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడి ప్రభుత్వ పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *