Breaking News

గిరిజన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

జుక్కల్, సెప్టెంబర్ 15: (E6tv NEWS: ప్రతినిధి).

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు హన్మంత్ షిండే ఆరోపించారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనులకు స్థానిక పాలనను చేరువ చేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాటలు వేసిందని పేర్కొన్నారు.గిరిజన కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి కోసం గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని హన్మంత్ షిండే తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

గిరిజనుల సంక్షేమం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు మరిన్ని మెరుగైన పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.తండాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హన్మంత్ షిండే కోరారు. గిరిజన ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *