ప్రజల వినతులను ఓపికగా విన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను ఓర్పుగా విని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు, విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, తాగునీరు, సాగునీటి సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని మంత్రికి దరఖాస్తులు సమర్పించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
చేనేత కార్మికులు సైతం మంత్రిని కలిసి ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందిస్తున్న చేనేత పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులు, అర్హతలు, పింఛన్ మంజూరు తదితర అంశాలను వివరించారు. మగ్గం నడుపుతూ జీవనం సాగిస్తున్న అర్హులైన చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగుల పింఛన్లకు సంబంధించిన సమస్యలను కూడా పలువురు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.




