Breaking News

మోర్తాడ్‌లో పోషణ మాసం కార్యక్రమం

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన

మోర్తాడ్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎస్సీ సంఘం భవనంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ, వేల్పూర్, భీంగల్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క కార్యక్రమానికి హాజరై పోషకాహార స్టాళ్లను సందర్శించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి, వాటి ద్వారా లభించే పోషక విలువల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలతో మాట్లాడి ఆరోగ్యకరమైన ఆహారంపై వివరాలు తెలుసుకున్నారు.పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన మాంసకృత్తులు, శక్తినిచ్చే పిండి పదార్థాలు, రక్షణనిచ్చే విటమిన్లు వంటి పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో గర్భిణీలు, బాలింతలకు వివరించారు.

సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో భాగంగా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు.కార్యక్రమంలో భీంగల్ సీడీపీఓ జ్ఞానేశ్వర్, ఏసీడీపీఓ జ్యోతి, ఆరు మండలాలకు చెందిన ప్రాజెక్టు సూపర్‌వైజర్లు, మండల సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *