Breaking News

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు లెక్క చెప్పాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి).

మోర్తాడ్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని ప్రకటించిందని గుర్తుచేసిన ప్రశాంత్‌రెడ్డి.. మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్‌ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంపు, తులం బంగారం, రైతుబంధు కింద ఎకరాకు రూ.15 వేలు, అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, కౌలు రైతులు, రైతు కూలీలకు రూ.12 వేల సాయం, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల, ప్రతి కుటుంబానికి ఇల్లు వంటి పలు హామీలు ఇచ్చిందన్నారు.ఆ ఆరు గ్యారంటీల్లో ఎన్ని పూర్తిగా అమలు చేశారో, 420 హామీల్లో ఎన్ని నెరవేర్చారో మంత్రి సీతక్క ప్రజల ముందు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే హామీ కాదని, ఇతర హామీల అమలుపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు. బాల్కొండ నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారు

ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే భయంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గొంతును అణచివేసే ప్రయత్నం చేశారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. స్పీకర్‌ను తమ సభ్యుడు అవమానించలేదని, ఒకవేళ అలా భావించి ఉంటే తమ సభ్యుడు, హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారని తెలిపారు.అయినప్పటికీ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ ఇంటిపై దాడి చేయడం ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తూ అసెంబ్లీలో చర్చించాలని తాము కోరితే, తమ ఎమ్మెల్యేలను పోలీసులతో అడ్డుకుని, సమావేశాల నుంచి సస్పెండ్‌ చేశారని ఆరోపించారు.

బాల్కొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

తాను గత పదేళ్లలో ఏమీ చేయలేదన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందించిన ప్రశాంత్‌రెడ్డి.. మోర్తాడ్‌లోనే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూడాలని సూచించారు. మోర్తాడ్‌లో సెంట్రల్‌ లైటింగ్‌, రోడ్లు, డివైడర్‌ పనులు గత ప్రభుత్వంలోనే మంజూరు చేసి చేపట్టినవేనని తెలిపారు.పాలెం, నాగాపూర్‌ గ్రామపంచాయతీ భవనాలు కూడా గత ప్రభుత్వ హయాంలో మంజూరై, శంకుస్థాపన చేసినవేనని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బాల్కొండ నియోజకవర్గాన్ని రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మంజూరు చేసి పూర్తి చేసిన అభివృద్ధి పనులు ఎన్ని ఉన్నాయో, వాటికి ఎంత నిధులు కేటాయించారో ప్రజలకు చెప్పాలని మంత్రి సీతక్కను ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు రిబ్బన్లు కట్‌ చేసి గొప్పలు చెప్పుకోవడం కాకుండా, తమ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పనులపై లెక్క చెప్పాలని అన్నారు.

అబద్ధాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తోందని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరు హామీలు ఇచ్చారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు హామీలు మరిచారన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.

బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోను ముందుపెట్టుకుని ప్రతి హామీ అమలుపై ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోర్తాడ్‌ సభలో వాస్తవాలను పక్కనపెట్టి విమర్శలు చేయడం మానుకుని, ముందుగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి సీతక్కకు హితవు పలికారు.

“ప్రజలకు కావాల్సింది ప్రసంగాలు కాదు.. అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన హామీల అమలు” అని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *