Breaking News

అడవి సిరికి.. ఆన్‌లైన్‌ దారి!

ఆదివాసి ఉత్పత్తులకు డిజిటల్‌ రెక్కలు.. ఇంటికే గిరి ఉత్పత్తులు

భద్రాచలం, సెప్టెంబర్‌ 15:(E6tv NEWS: ప్రతినిధి)

అడవిలో పండిన ఉత్పత్తులకు గిరిజనుల చేతుల మీదుగా విలువ జోడించి.. వాటిని దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ చేసేందుకు భద్రాచలంలోని భద్రగిరి మార్ట్‌ మరో ముందడుగు వేసింది. గిరిజనుల శ్రమకు సరైన గిట్టుబాటు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించే లక్ష్యంతో మార్ట్‌ను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి, ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుట్టారు.

అడవి ఉత్పత్తులకు ‘భద్రగిరి బ్రాండ్‌’

రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్‌ను ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్‌ ప్రారంభించారు. భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు గిరిజనుల సంప్రదాయ, ఆర్గానిక్‌, అటవీ ఉత్పత్తులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు.మిల్లెట్‌ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్డూలు, బర్ఫీలు, టీ పొడి, కరక్కాయలు, కరక్కాయ పొడి, తేనె, సబ్బులు, షాంపూలు, కుంకుడు కాయలు, అటవీ ఫలాలు, సేంద్రియ తృణధాన్యాలు, పప్పులు, బియ్యం తదితర ఉత్పత్తులు మార్ట్‌లో లభిస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్‌ బిస్కెట్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఏజెన్సీ గ్రామాలకు చెందిన గిరిజన మహిళలు, రైతులు తాము తయారు చేసిన, పండించిన ఉత్పత్తులను నేరుగా మార్ట్‌కు సరఫరా చేస్తున్నారు. తద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి ఉత్పత్తిదారులకే మెరుగైన ధర దక్కేలా చర్యలు చేపడుతున్నారు.

100 గిరిజన కుటుంబాలకు లబ్ధి

భద్రగిరి మార్ట్‌ ద్వారా సుమారు 100 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుండగా, మరో 10 కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆర్గానిక్‌, అటవీ, సంప్రదాయ గిరిజన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహించే వారపు గిరిజన సంతల వాతావరణాన్ని మార్ట్‌లో పునఃసృష్టించి, గిరిజన ఉత్పత్తులను పర్యాటకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

పర్యాటక రంగంతో అనుసంధానం.. ఆన్‌లైన్‌లో విక్రయాలు

భద్రగిరి మార్ట్‌ను పర్యాటక రంగంతో అనుసంధానం చేయడంతో పాటు తాజాగా ఆన్‌లైన్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో భద్రాచలానికి వచ్చే పర్యాటకులు, భక్తులు ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను మాత్రమే కాకుండా.. ఇకపై దూర ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా గిరిజన ఆర్గానిక్‌, అటవీ ఉత్పత్తులను ఆర్డర్‌ చేసుకునే అవకాశం కలగనుంది.

ఆన్‌లైన్‌ విక్రయాల ద్వారా గిరిజన ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్‌ లభించడంతో పాటు గిరిజన కుటుంబాల ఆదాయానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ఐటీడీఏ పీవో బి. రాహుల్‌ చేపట్టిన ఈ చర్యను పలువురు అభినందిస్తున్నారు.

పర్యాటకుల అభిప్రాయాలు

విజయలక్ష్మి, హైదరాబాద్‌:
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన సమయంలో భద్రగిరి మార్ట్‌ను సందర్శించి గిరిజనుల ఆర్గానిక్‌, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేశామని తెలిపారు. ఇక్కడ లభించే ఉత్పత్తులు నాణ్యంగా ఉన్నాయని, ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పించడం వల్ల ఇక దూరం నుంచి భద్రాచలం రావాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికే ఉత్పత్తులు తెప్పించుకోవచ్చని అన్నారు.

వసుంధర, సత్తుపల్లి:
విహారయాత్రలో భాగంగా భద్రాచలం వచ్చి స్వామివారి దర్శనం అనంతరం భద్రగిరి మార్ట్‌ను సందర్శించి ఆర్గానిక్‌ ఉత్పత్తులను కొనుగోలు చేశామని తెలిపారు. మార్ట్‌లో లభించే వస్తువులు నాణ్యతగా ఉన్నాయని, దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆన్‌లైన్‌ ద్వారా ఉత్పత్తులను ఇంటికే సరఫరా చేసే సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అడవి ఉత్పత్తులకు మార్కెట్‌.. గిరిజన కుటుంబాలకు ఆదాయం..
భద్రగిరి బ్రాండ్‌కు డిజిటల్‌ రెక్కలు రావడంతో గిరి ఉత్పత్తులు ఇక ఇంటికే చేరనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *