శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు.
రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పురోగతిని ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్‌ను కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా గ్లోబల్ ‘నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి ప్రసిద్ధ యూనివర్సిటీలు తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని వెల్లడించారు.
ఫ్యూచర్ సిటీని పూర్తిగా ‘నెట్ జీరో సిటీ’గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపిన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేయగా, సింగపూర్ బృందం సానుకూలంగా స్పందించింది. ఇదే సమయంలో డిసెంబరులో ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సింగపూర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్ పాల్గొన్నారు.

