గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు ఆందోళనకర రీతిలో అట్టడుగు స్థాయికి పడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరాశపరచడంతో పాటు 22 శాతం వర్షపాతం లోటు నమోదు కావడం, మరోవైపు నగరవాసుల నీటి వినియోగం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో సగటున 6.36 మీటర్ల లోతులో లభ్యమైన నీటిమట్టం, ఈ ఏడాది ఏకంగా 11.20 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే సగటున దాదాపు 5 మీటర్ల మేర నీటిమట్టం క్షీణించింది.
గ్రేటర్ పరిధిలోని దాదాపు 73 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు 10 మీటర్ల కంటే దిగువకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా కూకట్పల్లి, అమీర్పేట్, బాచుపల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సరూర్నగర్ పరిసరాల్లో నీటిమట్టాలు 15 నుండి 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లాయి. అత్యంత దారుణంగా కుత్బుల్లాపూర్ మండలంలో ఏకంగా 39 మీటర్లకు పైగా నీటిమట్టాలు పడిపోవడం కలకలం రేపుతోంది. ఈ సెప్టెంబర్ నెలలోనైనా భారీ వర్షాలు కురిస్తేనే నగరానికి ఉపశమనం లభిస్తుందని, లేనిపక్షంలో రానున్న వేసవిలో భాగ్యనగర వాసులకు కడగండ్లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

