హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఒక వినూత్న డిజిటల్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమ సమీపంలోని నిమజ్జన ప్రాంతాలను (Immersion Points) సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక QR కోడ్‌తో పాటు ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేసింది. సైబరాబాద్ వ్యాప్తంగా మొత్తం 53 నిమజ్జన ప్రాంతాలను అధికారులు సిద్ధం చేశారు.
ఈ టూల్ ద్వారా భక్తులు తమ ఫోన్ లోకేషన్ ఆన్ చేసి సమీపంలోని నిమజ్జన ఘాట్‌లు, అక్కడికి వెళ్లే మార్గాలు మరియు బాధ్యతాయుత అధికారుల ఫోన్ నంబర్లను సులభంగా తెలుసుకోవచ్చు. దీనితో పాటు పూజా వ్యర్థాలు (పువ్వులు, పూజా సామగ్రి) పర్యావరణానికి హాని కలిగించకుండా నిమజ్జనం పాయింట్ల వద్ద ప్రత్యేక ‘జంబో బ్యాగ్స్’ను ఏర్పాటు చేశారు. చెత్తను నీటిలో పడేయకుండా ఈ బ్యాగుల్లోనే వేయాలని, అవసరమైతే అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బంది సహాయం తీసుకోవాలని అధికారులు కోరారు.

