Breaking News

రోడ్డు పక్కన భారీగా ప్రభుత్వ మందులు: పట్టుకున్న వైద్య సిబ్బంది!

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులోని నేషనల్ హైవే-44 పక్కన భారీగా ప్రభుత్వ మందులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేయాల్సిన మెడిసిన్‌ను కొందరు వ్యక్తులు మినీ డీసీఎం వ్యాన్‌లో తీసుకొచ్చి రోడ్డు పక్కన పారబోస్తుండగా స్థానిక వైద్య సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.

ఇంకా కాలపరిమితి (వ్యాలిడిటీ) ఉన్న సుమారు ₹15 లక్షల విలువైన మందులను ఈ విధంగా పారబోస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా బస్వాపూర్, భిక్కనూరు మండల కేంద్రం, రామేశ్వర్‌పల్లి పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రీతిలో మందులను పారబోసినట్లు సమాచారం. ఈ ఘటనపై భిక్కనూరు మెడికల్ ఆఫీసర్ యేమిమా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన భిక్కనూరు పోలీసులు మందులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మినీ డీసీఎం వ్యాన్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అసలు ఈ ప్రభుత్వ మందులు ఎక్కడి నుంచి వచ్చాయి? వ్యాలిడిటీ ఉన్న మెడిసిన్‌ను ఎందుకు బయట పారబోస్తున్నారు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *