Breaking News

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ముప్పు: పోరంకి వద్ద తీవ్ర కలకలం!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి వద్ద ఏర్పాటు చేసిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పెనమలూరు మండలం పోరంకి వద్దకు కాన్వాయ్ చేరుకోగానే, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు.

వాహనాలు వేగంగా వస్తున్న సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, అప్రమత్తమైన గవర్నర్ భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి, కాన్వాయ్‌ను సురక్షితంగా ముందుకు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో కాన్వాయ్‌కు అడ్డువచ్చిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. భద్రతా లోపంపై స్పందించిన పోలీసులు ఘటనపై ఆరా తీస్తూ విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *