హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా వేధిస్తున్న 22-A (నిషేధిత భూముల) సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 22-A పరిధిలోని 12 ప్రధాన అంశాలను ప్రభుత్వం గురింఛిందని, సమస్య పరిష్కారానికి త్వరలోనే సమగ్ర విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల వ్యవహారంలోనూ త్వరలోనే నూతన విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
హెచ్ఎండిఏ (HMDA), డీటీసీపీ (DTCP) వంటి నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన అధీకృత లేఔట్లలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారంలోగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇకపై 22-A నిషేధిత జాబితాలో ఒక భూమిని చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా పక్కా నిబంధనలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. పొరపాటున 22-A పరిధిలోకి వచ్చిన వ్యక్తిగత భూములను పరిశీలించి తొలగించే అధికారాలను కలెక్టర్లు, ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా జీవో 58, 59, 166 కింద ప్రభుత్వం గతంలో క్రమబద్ధీకరించిన భూములను, ప్రభుత్వ వేలంలో కొనుగోలు చేసిన ల్యాండ్స్, మరియు బ్యాంకులు తనఖా పెట్టుకుని వేలం వేసిన భూములను కూడా 22-A నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తామని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో వేలాది మంది భూ యజమానులకు, ప్లాట్ల కొనుగోలుదారులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.

