కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదు
సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాం
పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు
పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)
నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు.
పెనుకొండ మున్సిపాలిటీలోని 17, 18వ వార్డుల్లో మంత్రి సవితమ్మ పర్యటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు.అంబేద్కర్ సర్కిల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్‌షెల్టర్‌ను మంత్రి పరిశీలించి, ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి, విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా గ్రౌండ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఆయా నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 1,200 కుటుంబాలకు ఇంటి పొజిషన్ పత్రాలు అందించేందుకు చర్యలు చేపట్టామని, స్థలం ఉన్న అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కేసులు పెట్టడం, కక్ష సాధింపు రాజకీయాలు చేయడం తమ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశామని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





