హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉన్న ఓ రెండు అంతస్థుల ప్రైవేట్ కిడ్స్ స్కూల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో పాఠశాల, రెండో అంతస్తులో నివాస గృహం ఉండటంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై భవనంలోని వారిని ఖాళీ చేయించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి భవనంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తరలించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలాన్ని హైడ్రా (HYDRA) అధికారులు, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

