Breaking News

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు:మంత్రి లోకేశ్‌!

నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నెల్లూరు నగరంలో భారీ మౌలిక వసతుల విప్లవానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసిన ఆర్.ఎస్.ఆర్., దేవిరెడ్డి శారద (డీఎస్ఆర్‌) ప్రభుత్వ పాఠశాల భవనాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం వైభవంగా ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్.ఎస్.ఆర్. మున్సిపల్ హైస్కూల్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన ‘వీపీఆర్ ఫౌండేషన్’ రూ. 8.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో సమూలంగా పునరుద్ధరించింది. రెండు అంతస్తుల్లో 43 డిజిటల్ తరగతి గదులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, రోబోటిక్స్, కంప్యూటర్, ఆస్ట్రో మరియు సైన్స్ ల్యాబ్‌లతో పాటు ఆర్ట్, మ్యూజిక్ గదులను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రీడల కోసం 21 వేల చదరపు అడుగుల సింథటిక్ కోర్టు, అవుట్‌డోర్ జిమ్‌ను సైతం అభివృద్ధి చేశారు. అనంతరం మూలపేటలో రూ. 13.4 కోట్ల నిధులతో మోడర్నైజ్ చేసిన డీఎస్ఆర్ స్కూల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.

అనంతరం పాఠశాలల పనితీరుపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్, భౌతిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు, ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగాలని అధికారులను ఆదేశించారు. గతంలో తక్కువగా నమోదైన పదో తరగతి ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రైవేట్ బడులకు పోటీగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *