విదేశీ ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 16 వరకు సమయం ఉన్నప్పటికీ, ఒకరోజు ముందే ఆమె న్యాయవాదులతో కలిసి మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు ఆమెపై 20కి పైగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కన్సల్టెన్సీ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలన్నీ తన భర్తే చూసుకునేవారని, ఈ మోసాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నందన పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా, తనపై ఉన్న లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) ను ఉపసంహరించుకోవాలని కోరగా, విచారణకు పూర్తిగా సహకరిస్తే పరిశీలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
నేపథ్యం ఇది: విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామని నందన, ఆమె భర్త కలిసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి మోసం చేశారనే ఫిర్యాదులతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి దంపతులిద్దరూ పరారీలో ఉండటంతో ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించగా, ప్రాథమిక విచారణ అనంతరం విడుదల చేసి 16వ తేదీలోగా హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

