నెల్లూరు: నెల్లూరు నగర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న పనులపై వైసీపీ నేతలు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారిదిన్నెలో రూ.35 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన ‘స్వర్ణ వార్డు’ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిలిపివేసిన భూగర్భ డ్రైనేజీ (UGD) పనులతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని తెలిపారు. నెల్లూరు నగర శివారు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.250 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్క యలమవారిదిన్నె పరిధిలోని UGD పనులకే రూ.33 కోట్లు కేటాయించి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.

