పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)
“మన అంగన్వాడీ – మన బాధ్యత” అనే నినాదంతో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్–2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పాల్వంచ, వెంగళరావు సెక్టార్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి 44వ డివిజన్ కార్పొరేటర్ విసంశెట్టి విశేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒక గర్భిణీకి శ్రీమంతం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన, నలుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహారం, పోషక పదార్థాల ప్రాధాన్యత, తల్లి–శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు. గర్భధారణ సమయంలో తల్లులు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో SVS నాగమణి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
“పోషకాహారమే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది” అనే సందేశంతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

