ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి)
తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని నాయకులు స్మరించుకున్నారు.ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు, అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.




