నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమం
14 పాఠశాలల్లో 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
170 మందికి ఉచిత మందులు.. అనంతరం అద్దాల పంపిణీ
పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ టి. రామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.గత నెలలో నవ లిమిటెడ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో పాల్వంచలోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో సుమారు 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 170 మంది విద్యార్థులకు ఉచితంగా మందులు అందించారు. తదుపరి పరీక్షల ఆధారంగా అవసరమైన విద్యార్థులకు తాజాగా కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకారం
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి టి. రామారావు మాట్లాడుతూ విద్యాభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు.నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్ హెడ్ డి. సుధాకర్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాధి కార్యక్రమాలను వివరించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు సంస్థ భవిష్యత్తులోనూ సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ హెడ్ పి. గోపాలకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. ప్రభావతి, వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సీఎస్‌ఆర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

