ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా పుంజుకుంటోందని, దేశంపై అంతర్జాతీయ సమాజానికి విశ్వాసం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ‘సెమీకాన్ ఇండియా 2026’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్య విశేషాలు:
- ఆర్థిక స్థితిస్థాపకత: ఇటీవలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని, ఇది దేశ ఆర్థిక దృఢత్వాన్ని చాటుతోందని తెలిపారు.
- గ్లోబల్ చిప్ హబ్: భారత చిప్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, త్వరలోనే “మేడ్ ఇన్ ఇండియా” చిప్స్ ప్రపంచమంతటా విస్తరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
- లాజిస్టిక్స్ విప్లవం: దేశంలో 3,000 కిలోమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు అందుబాటులోకి వచ్చి తయారీ, లాజిస్టిక్స్ రంగానికి కొత్త ఊపునిచ్చాయని పేర్కొన్నారు.
- అంతర్జాతీయ గుర్తింపు: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ భారత్‌కు సావరిన్ రేటింగ్ అప్‌గ్రేడ్ ఇవ్వడం, బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం లభించడం అంతర్జాతీయంగా భారత ప్రాధాన్యతను పెంచాయని చెప్పారు.
‘సెమీకాన్ 2.0’ – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు:
- రూ. 800 కోట్ల నిధులు: సెమీకండక్టర్ తొలి దశలో 105 స్టార్టప్‌లు పాల్గొనగా, అందులో 20 స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటల్ ద్వారా రూ.800 కోట్ల నిధులను సేకరించాయి.
- నైపుణ్యాభివృద్ధి: పదేళ్లలో 85,000 మంది డిజైన్ ఇంజనీర్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం నాలుగేళ్లలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేశామని తెలిపారు.
- భవిష్యత్తు లక్ష్యాలు: సెమీకాన్ 2.0 కింద కనీసం 200 చిప్-డిజైన్ స్టార్టప్‌లకు మద్దతివ్వనున్నట్లు, దేశవ్యాప్తంగా 400కు పైగా యూనివర్సిటీల్లో ఈడీఏ (EDA) టూల్స్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

