డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలకు తావులేదు
దళారులను నమ్మి మోసపోవద్దు: సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్
రుద్రూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).
అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కొంతమంది దళారులు అర్హులైన పేదలకు కాకుండా తమకు అనుకూలమైన వారికి ఇళ్లు అందేలా వ్యవహరించారని పేర్కొన్నారు. కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి అర్హులైన నిరుపేదలకు బదులుగా అనర్హుల పేర్లు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు.గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేసిన కొందరు వ్యక్తులు ప్రస్తుతం కూడా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వస్తోందని సర్పంచ్ తెలిపారు. ఇళ్లను ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు.
ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతోందని, దొరల పాలనకు తావులేదని సర్పంచ్ అన్నారు. ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా గ్రామసభ నిర్వహించి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో, తహసీల్దార్, గ్రామ పెద్దల సమక్షంలో డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు పంపిణీ చేసేలా కృషి చేస్తామని సునీత చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉపసర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు సభ్యులు పర్వీన్ బేగం, ఆమంద్ వెంకటేష్, కోతి పార్వతి, పార్వతి పూజిత, బొంబాయి విమల, కుర్ల పోశెట్టి, వడ్ల అమృత, బక్క శివకుమార్, గొర్ల కృష్ణ, సాగరిక తదితరులు పాల్గొన్నారు.


