Breaking News

CMR సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్‌కు పిలుపు.. MROకు వినతిపత్రం

బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).
కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. ప్రస్తుతం ఉన్న నిల్వలపై 15 నుంచి 20 శాతం వరకు షార్ట్‌ఫాల్ ఏర్పడిన సందర్భాల్లో వెంటనే కాస్ట్‌షీట్ ప్రకారం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయకుండా, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు CMR డెలివరీలు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.రబీ 2025-26 బాయిల్డ్ ధాన్యం విషయంలోనూ సమస్యలు ఉన్నాయని మిల్లర్లు పేర్కొన్నారు. బాయిల్డ్ మిల్లుల్లో దింపుకున్న ధాన్యాన్ని బాయిల్డ్ బియ్యంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వానికి అవసరం లేని పక్షంలో టెండర్లు లేదా ఇతర మార్గాల ద్వారా ధాన్యాన్ని మిల్లుల నుంచి త్వరగా తరలించే చర్యలు చేపట్టాలని కోరారు.

రైతుల నుంచి వచ్చిన Non-FAQ ధాన్యం కారణంగా బియ్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసేందుకు Sortex ప్రక్రియ చేపట్టాల్సి వస్తోందని, దీంతో డిస్‌కలర్, డ్యామేజ్ బియ్యం అధికంగా వస్తోందని మిల్లర్లు తెలిపారు. ఈ బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో క్వింటాల్‌కు రూ.750 నుంచి రూ.1,000 వరకు నష్టం వాటిల్లుతోందని వారు పేర్కొన్నారు. 67 శాతం రికవరీ లక్ష్యాన్ని చేరుకోవడం కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందికరంగా మారిందని తెలిపారు.KMS 2025-26 ఖరీఫ్ ధాన్యం మిల్లుల్లో నిల్వ చేసిన అనంతరం సుమారు తొమ్మిది నెలల వరకు CMR సేకరణ జరగకపోవడంతో సహజ తరుగు ఏర్పడిందని మిల్లర్లు పేర్కొన్నారు. దీర్ఘకాలం నిల్వ ఉండటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి బస్తా బరువు తగ్గిందని, దీనిని మిల్లర్ల లోపంగా పరిగణించరాదని కోరారు.

అలాగే రబీ సీజన్‌లో అధికారుల సూచనల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ధాన్యం నిల్వ చేశామని, ప్రస్తుతం గోదాముల్లో స్థలం లేకపోవడంతో బాయిల్డ్ బియ్యం సేకరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఆరుబయట నిల్వ ఉన్న ధాన్యం వర్షాలు, ఎండల కారణంగా దెబ్బతింటోందని, వెంటనే FCI అధికారులతో సమన్వయం చేసి బాయిల్డ్ బియ్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఫిజికల్ వెరిఫికేషన్లు, కఠిన చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ సమస్యలు పరిష్కరించే వరకు తనిఖీలపై పునరాలోచన చేయాలని, CMR డెలివరీ గడువును కనీసం మరో రెండు నెలలు పొడిగించాలని కోరారు. డిఫాల్ట్ మిల్లులపై విధించిన 25 శాతం నుంచి 12 శాతం వరకు ఫైన్‌ను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైస్ మిల్లింగ్ పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని తమ సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *