Breaking News

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ

బోధన్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమేనని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.

బోధన్ పట్టణంలోని మధుమలంచ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో “1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. నాటి నిజాం నిరంకుశ పాలన, కాశీం రజ్వీ ఆగడాలు, దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారీలు, జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందన్నారు.

ప్రజలకు భూములు దక్కాలనే లక్ష్యంతో జరిగిన సాయుధ పోరాటంలో లక్షల ఎకరాల భూములు ప్రజలకు పంచినట్లు ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం తెలంగాణలోకి వచ్చిన పటేల్ సైన్యాలు వేలాది మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలను హతమార్చాయని ఆరోపించారు. తెలంగాణలో జరిగిన ఘటనలకు సంబంధించి సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్రపై తమకు భిన్నమైన చారిత్రక అవగాహన ఉందని పేర్కొంటూ, సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలని అన్నారు.ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని రాజేశ్వర్ పిలుపునిచ్చారు. విద్యారంగ పరిరక్షణకు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. కార్తీక్, బోధన్ డివిజన్ నాయకులు సాయినాథ్, నిఖిల్, సాయికిరణ్, వంశీ, ప్రసాద్, రాజుతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *