Breaking News

హంద్రీ–నీవా కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి

పేరూరు డ్యాంకు నీరు అందించాలి – జలదీక్షలో జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ

అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).
హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న చెరువులకు, పేరూరు డ్యాంకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు.

రైతుల సాగునీటి హక్కుల కోసం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన జలదీక్ష కార్యక్రమంలో గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా లేక రైతులు పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు.రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం, సమాజం బాగుంటుందని పేర్కొన్న ఆమె.. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్య విషయంలో రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం వెంటనే హంద్రీ–నీవా పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న చెరువులకు, పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని గిరిజమ్మ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన క్షేత్రస్థాయిలో పోరాటాలు, నిరసనలు చేపట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.అనంతరం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు హంద్రీ–నీవా కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *