మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సిట్టింగ్ జడ్జితో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి ఆస్తులపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం చేసి, అసెంబ్లీలో మాత్రం 67 ఎకరాలు ఉందనడంపై రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన కేసీఆర్ కుటుంబానికి తాతల కాలం నుంచి వందల ఎకరాలు ఉండేదని, ఇప్పుడు 67 ఎకరాలు ఉండటం తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 933 ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే ఆ భూములను వెంటనే రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఆస్తులపై కూడా కేటీఆర్ పలు ప్రశ్నలు గుప్పించారు:
- అమెరికాలో ఉద్యోగం చేసి తాను సంపాదించుకున్నానని, మరి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ లాంటి ఇల్లు, ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.
- రేవంత్ తమ్ముళ్లు ఏరోస్పేస్ కంపెనీలు ఎలా ఏర్పాటు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
- సీఎం అయ్యాక ఆయన చిన్నాన్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో విచారణ జరిపించి నిజాలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ స్కామ్‌లకు పాల్పడుతూ, బీఆర్ఎస్ నేతలపై బురదజల్లే యత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

