సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో రజాకార్లు జరిపిన ఘోరాలు, నరమేధాన్ని గత పాలకులు చరిత్ర పుటల నుంచి తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు. ఎంత దాచాలని చూసినా సత్యం ఎప్పటికీ దాగిపోదని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి భయపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకడుగు వేశాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎంకు అనుకూలంగా ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా నిజాం పాలకులను సీఎం రేవంత్ రెడ్డి పొగడటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కిషన్ రెడ్డి, “నిజాం నిజంగానే మంచివాడైతే తెలంగాణ విమోచన కోసం సాయుధ పోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ‘ఆపరేషన్ పోలో’ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది?” అని నిలదీశారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

