Breaking News

ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి ప్రోత్సహిస్తాం

పెనుకొండలో క్రీడా సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉంది

ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి

అనంతపురం, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).


ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సెప్టెంబర్ 16న ప్రారంభమైన ఈ ఎంపిక ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువ క్రికెటర్లు పాల్గొంటున్నారు. పెనుకొండలో నిర్వహించిన ఎంపిక కార్యక్రమానికి 83 మంది క్రీడాకారులు హాజరైనట్లు రామలింగారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించడంతో పాటు మ్యాచ్‌లు నిర్వహించి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఆర్డీటీ కృషి చేస్తోందన్నారు. యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పెనుకొండలో క్రీడలకు సుదీర్ఘమైన చరిత్ర, మంచి క్రీడా సంస్కృతి ఉందని పేర్కొన్న ఆయన.. హైస్కూల్ వద్ద అందుబాటులో ఉన్న క్రీడా సదుపాయాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు.అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఆర్డీటీ చేస్తున్న కృషి అభినందనీయమని పెనుకొండ MEO రాఘవయ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక కార్యక్రమంలో పెనుకొండ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు SLN ప్రసాద్, సెలెక్టర్లు సి. వెంకటేష్, యోగానంద, విజయ్ రాజు, RDT కోఆర్డినేటర్ ప్రవీణ్, కోచ్ ముద్దాసిర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *