ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: సీపీ సాయి చైతన్య
సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. మన ఊరు–మన భద్రత–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో 16 సీసీ కెమెరాలను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతో పాటు నేరాల నియంత్రణ, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు.ట్రాఫిక్ నియంత్రణలోనూ సీసీ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పచ్చలనడుకుడ గ్రామంలో 16 కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో పాటు గ్రామ పంచాయతీని సీపీ అభినందించారు. గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం రెడ్డీస్ యూత్ గణేష్ మండలి వద్ద యువత సన్మార్గంలో నడవాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం గణేష్ మండలి వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, వేల్పూర్ ఎస్‌ఐ సంజీవ్, సర్పంచ్ కొల్లే నరసయ్య, ఉపసర్పంచ్ రఘుపతి, మాజీ సొసైటీ చైర్మన్ లింభారెడ్డి, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

