హైదరాబాద్లోని అమీర్పేట్ ఆశ్రయ్ మెడోస్ అపార్ట్మెంట్స్ తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. భవనాలను పూర్తిగా నివాస అవసరాలకే వినియోగిస్తామని నిర్మాణ సమయంలో చేసుకున్న ఒప్పందాల (MoU) ఆధారంగానే తాము ఇక్కడ ఇళ్ళు కొనుగోలు చేశామని, కానీ తీరా నిర్మాణం పూర్తయ్యాక నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆశ్రయ్ మెడోస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వాణిజ్య వ్యాపారాల వల్ల బయటి వ్యక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయి, ప్రాంగణంలోని మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారిందని వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై నిలదీసిన నివాసితులపై కొందరు ఒత్తిడి తీసుకురావడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో భవన వినియోగ రికార్డులు, నిర్మాణ అనుమతులను వెంటనే పరిశీలించి, అనుమతులు లేకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

