నిజామాబాద్, సెప్టెంబర్ 17:{E6tv NEWS: శివ ఠాకూర్)
నగరంలోని టౌన్-2 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
హత్యకు దారితీసిన పరిస్థితులు, సంఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సంఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించడంతో పాటు, కీలక ఆధారాల సేకరణ, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, ప్రత్యక్ష సాక్షులు, సంబంధిత వ్యక్తుల నుంచి వివరాల సేకరణ వంటి దర్యాప్తు చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు.ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంఘటన స్థలంలో అవసరమైన పోలీసు బందోబస్తు, పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, టౌన్-2 ఎస్సై యాదగిరి గౌడ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.



