‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పుస్తక విడుదలను అడ్డుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్
జమ్మికుంట, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).
డా. బి.ఆర్. అంబేద్కర్‌ను విమర్శిస్తూ ‘కలిపిత నాయకుడు అంబేద్కర్’ పేరుతో పుస్తకాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం సహించబోమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జ్ఞానం, ఆలోచనలు, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన కృషికి గౌరవం లభిస్తుంటే, దేశంలోనే ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, అన్ని వర్గాలు, కులాలు, మతాలకు చెందిన ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు.అంబేద్కర్‌ను విమర్శించే వారు ముందుగా ఆయన రచనలు, ఆలోచనలు, భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఆధారాలు లేని లేదా అవమానకరమైన రచనలను ప్రోత్సహించడం కంటే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదివి తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ గౌరవానికి భంగం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం చట్టపరంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పుల్లూరి ప్రశాంత్ కోరారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

