Breaking News

యువతకు బంగారు పునాదులు వేస్తున్నాం

ఏటా జాబ్ క్యాలెండర్‌.. ఈ ఏడాది 10,060 పోస్టుల భర్తీకి నిర్ణయం

2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి)

రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. తమది జెన్‌ జీ పక్షపాతి ప్రభుత్వం అని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2047 నాటికి యువశక్తితో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఏటా జాబ్ క్యాలెండర్

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ ఏడాది 10,060కుపైగా పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా 892 ఉద్యోగాలు, పోలీస్ శాఖలో 2,050 పోస్టులు, అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు.త్వరలో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని, రాబోయే మూడేళ్లలో మూడు డీఎస్సీలు నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక పోర్టల్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు నైపుణ్యం పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. యువత తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని మంత్రి సవిత విమర్శించారు. ఐదేళ్ల పాలనలో టీచర్ పోస్టుల భర్తీ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి సవిత సూచించారు. సెల్‌ఫోన్లను అవసరమైన మేరకే వినియోగించాలని, చదువుపై దృష్టి పెట్టాలని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం గర్వపడేలా విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *