Breaking News

డీజే అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించిన పోలీసులు

మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి)

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఏర్పాటు చేయాలనుకున్న గణేష్ మండలి నిర్వాహకులకు పోలీసులు అండగా నిలిచారు. డీజేకు అనుమతి లేదని పోలీసులు సూచించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, రెండు నెలల క్రితం చెల్లించిన రూ.5 వేల అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇప్పించారు.

కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం మరేపల్లి గ్రామంలోని ఏకదంత గణేష్ మండలి నిర్వాహకులు శంకర్, శుభం రెండు నెలల క్రితం జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి డీజే కోసం రూ.5 వేల అడ్వాన్స్‌గా చెల్లించారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే ఏర్పాటు చేయవద్దని పోలీసులు సూచించడంతో నిర్వాహకులు డీజే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదును తిరిగి ఇప్పించాలని నిర్వాహకులు పోలీసులను కోరగా, వారి విజ్ఞప్తిపై మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి స్పందించారు. పోలీసు సిబ్బంది సహకారంతో డీజే కోసం అడ్వాన్స్ తీసుకున్న వ్యక్తులను పిలిపించి పరిస్థితిని వివరించి అవగాహన కల్పించారు. అనంతరం రూ.5 వేల మొత్తాన్ని గణేష్ మండలి నిర్వాహకులకు తిరిగి ఇప్పించారు.

పోలీసుల చొరవతో తమ డబ్బులు తిరిగి రావడంతో గణేష్ మండలి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సై మోహన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల సూచనలు పాటించాలని ఎస్సై మోహన్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *