Breaking News

28 ప్యాకేజీకి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలి

పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ముధోల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి)

ముధోల్ నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, వాటి పూర్తికి ప్రభుత్వం తక్షణమే రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు.

శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే 28 ప్యాకేజీ పనుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనులకు నిధులు కేటాయించాలని పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముధోల్ నియోజకవర్గ రైతులు విలువైన భూములను కోల్పోయారని, అలాంటి రైతుల సాగునీటి అవసరాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. 28 ప్యాకేజీ పనుల పూర్తికి రూ.500 కోట్లు విడుదల చేస్తే అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేసి వేలాది మంది రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.2.20 కోట్లు

అదేవిధంగా పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఇప్పటికే సుమారు రూ.80 కోట్ల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేసినప్పటికీ, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సరఫరా కోసం మరో రూ.2.20 కోట్ల నిధులు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు.తక్షణమే రూ.2.20 కోట్లు విడుదల చేసి విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకొస్తే సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు.

ముధోల్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 28 ప్యాకేజీతో పాటు పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *